Republic Day: నిరాడంబరంగానే అయినా... సైనిక పాటవాన్ని చాటిన గణతంత్ర వేడుకలు!

  • అమర వీరులకు నివాళులు అర్పించిన ప్రధాని
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి
  • తొలిసారిగా కనువిందు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్స్
  • అలరించిన 32 శకటాలు
New Delhi Republic Day Celebrations

ప్రతి సంవత్సరమూ జరిగేంత ఆర్భాటంగా కాకున్నా, 72వ భారత గణతంత్ర వేడుకలు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో సైనిక పాటవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయి. తొలుత సంప్రదాయం ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు, జాతీయ యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని సందర్శించి, అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, తన సందేశాన్ని రాశారు.

ఆ వెంటనే రాజ్ పథ్ లో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని, ఒక్కొక్కరుగా వచ్చిన అతిథులను స్వాగతించారు. రాష్ట్రపతి కాన్వాయ్ రాగానే, ఆయనకు నమస్కరించి, స్వాగతం పలికి, వేదికపైకి తోడ్కొని వెళ్లారు. ఆపై 21 గన్ సెల్యూట్, జాతీయ గీతాలాపన అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం సమర్పించారు.

ఆ తరువాత వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి గత సంవత్సరం ఇండియా దిగుమతి చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాలు తొలిసారిగా గణతంత్ర పరేడ్ లో పాల్గొన్నాయి. ఇవి చేసిన వర్టికల్ చార్లీ విన్యాసాలను అతిథులు చప్పట్లతో స్వాగతిస్తూ తిలకించారు. లక్షల మంది ప్రత్యక్షంగా చూడాల్సిన ఈ క్షణాలను వేల మంది మాత్రమే వీక్షించగా, కోట్లాది మంది టీవీ చానెల్స్, వెబ్ మీడియా ద్వారా తిలకించారు.

ఇక ఆర్మీ అధీనంలో ఉన్న టీ-90 ట్యాంకులు, సంవిజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆపై 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 32 శకటాలు పరేడ్ లో పాల్గొన్నాయి. వీటిల్లో కరోనా వ్యాక్సిన్ శకటంతో పాటు రామమందిరం శకటం, ఏపీకి చెందిన లేపాక్షీ థీమ్ శకటం అలరించాయి. 122 మంది సైనికులతో కూడిన బంగ్లాదేశ్ సైనికులు కూడా ఈ పరేడ్ లో పాల్గొనడం గమనార్హం.

More Telugu News