'అత్యంత చెత్త అధ్యక్షుడు'... ట్రంప్ ఇంటి ముందు విమానాలతో బ్యానర్ల ప్రదర్శన... వీడియో ఇదిగో!

26-01-2021 Tue 07:54
  • 19న శ్వేతసౌధాన్ని వీడిన ట్రంప్
  • ప్రస్తుతం ఫ్లోరిడాలోని రిసార్ట్ లో నివాసం
  • బ్యానర్లు ప్రదర్శించిన రెండు విమానాలు
Worest President Ever Banners with Planes infront of Trump

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ దిగిపోయి ఇప్పటికి కేవలం ఆరు రోజులే అవుతోంది. అయినా ఆయన రేపిన చిచ్చు ఇంకా ఆగలేదు. సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ పై ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ట్రంప్ ను విమర్శించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆన్ లైన్ లో ట్రంప్ ఎంతో మంది నుంచి విమర్శలను ఎదుర్కోవడం ఇదే తొలిసారేమీ కాదు. అయితే, ఇప్పుడో వినూత్న ఘటన జరిగింది. విమర్శలు ఆకాశమంత ఎత్తునకు ఎగిరాయి.

అధ్యక్ష బాధ్యతల నుంచి ట్రంప్ తప్పుకున్న తరువాత ఫ్లోరిడాకు ఆయన తన మకాంను మార్చారు. తాజాగా ఆయన ఉంటున్న ఇంటి ముందు నుంచి రెండు విమానాలు భారీ బ్యానర్లను మోసుకుంటూ వచ్చి పరేడ్ చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 'అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు' అంటూ, 'ఘోరంగా ఓడిపోయిన వ్యక్తి' అంటూ రెండు భారీ బ్యానర్లను ఈ విమానాలు ఆయన నివాసం ముందు ప్రదర్శించాయి.

విమానాలకు ఈ బ్యానర్లను కట్టి, వీటిని పంపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లోరిడా పరిధిలోని మార్-ఏ-లాగొో రిసార్ట్ లో ట్రంప్ ఉండగా, ఆయనకు కనిపించేలా ఇవి పెద్ద శబ్ధం చేస్తూ, తక్కువ ఎత్తులో ఎగిరాయి. అయితే, ఈ విన్యాసాలను ఎవరు చేశారన్న విషయంలో మాత్రం సమాచారం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోలను ట్రంప్ వ్యతిరేకులు తెగ షేర్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఫ్లోరిడా ప్రజలు దీనిపై చర్చించుకుంటున్నారు. చాలామంది ఈ విమానాలను చూసి అసంతృప్తి చెందామని వ్యాఖ్యానించడం గమనార్హం. మాజీ అధ్యక్షుడిని ఇలా అవమానించడం తగదని కామెంట్లు వస్తున్నాయి.