మదనపల్లె ఘటనలో వెలుగులోకి షాకింగ్ విషయాలు

26-01-2021 Tue 07:38
  • క్షుద్రపూజలను విశ్వసించే విద్యావంతుల కుటుంబం
  • రోడ్డుపై నిమ్మకాయలు తొక్కడమే హత్యలకు కారణం
  • దెయ్యాన్ని వదిలించేందుకు కుమార్తె తలపై డంబెల్‌తో కొట్టిన తల్లి
  • చనిపోయిన చెల్లెలు ఆత్మను బంధించానన్న అక్క
  • వారు పుణ్యలోకాల్లో ఉన్నారని, ఉదయాన్నే తీసుకొస్తానన్న తల్లి
Shocking things come to light in Madanapalle incident

చిత్తూరు జిల్లా మదనపల్లెలో తల్లిదండ్రులు తమ కుమార్తెలను దారుణంగా చంపిన ఘటనలో వెల్లడవుతున్న విషయాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.  ఉన్నత విద్యావంతులై కళాశాలలలో పనిచేస్తున్న భార్యాభర్తలు, ఉన్నత విద్యావంతులైన వారి కుమార్తెలు క్షుద్రపూజలను నమ్మడం విస్తుగొలుపుతోంది.

చిన్నకుమార్తె సాయిదివ్య (22) మనోవ్యాకులత కుటుంబాన్ని క్షుద్రపూజలవైపు నడిపించింది. అంతేకాదు, ఈ కుటుంబానికి భక్తి కూడా అపారం. చివరికి తలనొప్పి వచ్చి తగ్గిపోయినా బాబా దయవల్లేనని చెప్పుకునేంత వరకు వెళ్లిపోయారు. రోజంతా ఉపవాసం ఉన్నా ఆకలి లేకపోవడానికి బాబా దయే కారణమని చెప్పేవారు.

తల్లి పద్మజ ఫేస్‌బుక్ పోస్టులు మొత్తం ఆధ్యాత్మికానికి చెందినవే ఉండేవి. ఆమె భర్త పురుషోత్తంనాయుడు తరచూ ఆధ్యాత్మిక, తాంత్రిక పుస్తకాలు చదువుతూ ఉండేవారు. వారం రోజుల క్రితం పెద్దమ్మాయి అలేఖ్య (27), సాయిదివ్య కలిసి పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మూడు రోడ్ల కూడలిలో   ముగ్గువేసి అందులో ఉంచిన నిమ్మకాయలను పొరపాటున తొక్కేశారు.

ఇంటికొచ్చాక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏమైనా అవుతుందోమోనని భయపడిపోయారు. ఆ ఘటన తర్వాత అలేఖ్య మౌనంగా మారిపోయింది. మరోవైపు, ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చిన్నకుమార్తె చెప్పింది. చివరికి టాయిలెట్‌కు వెళ్లాలన్నా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. అంతగా భయపడిపోయారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఓ మంత్రగాడిని కలిసి తాయెత్తు కట్టించుకున్నారు. గత వారం రోజులుగా పద్మజ, పురుషోత్తం ఇద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు.

ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజలు చేస్తుండగా, పై అంతస్తులో ఉన్న సాయిదివ్య మ్యూజిక్ వాయిస్తూ ఒక్కసారిగా కేకలు వేసింది. మానసిక రోగిలా ప్రవర్తించింది. దీంతో పరుగున వెళ్లిన మిగతా ముగ్గురు ఆమెకు దెయ్యం ఆవహించిందని భావించారు. దానిని వదిలించేందుకు  ఆమె తలపై డంబెల్‌తో గట్టిగా కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

 అప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన అలేఖ్య చెల్లెలి నుదుటిపై  ముగ్గులు వేసి ఆత్మ బయటకు వెళ్లకుండా బందించానని చెప్పింది. ఆమెను బతికించేందుకు తనను కూడా చంపాలని తల్లిని కోరింది. దీంతో ముగ్గురూ కలిసి నగ్నంగా పూజలు చేశారు. పూజల అనంతరం అలేఖ్యను పూజగదిలోకి తీసుకెళ్లిన తల్లి.. కూతురు నోట్లో రాగి కలశాన్ని పెట్టి, అందులో నవధాన్యాలు పోసింది. ఆపై డంబెల్‌తో ఆమెను కూడా కొట్టి చంపారు.

సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఏడు గంటలకు విషయాన్ని పురుషోత్తం తన సహచర అధ్యాపకుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన పరుగున వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారొచ్చి మృతదేహాలను తరలించే ప్రయత్నం చేయగా పద్మజ అడ్డుకుంది. కుమార్తెలు ఇద్దరు పుణ్యలోకాల్లో ఉన్నారని, తానే పార్వతిని అని చెప్పుకొచ్చింది. రేపు ఉదయాన్నే వారిని బయటకు తీసుకొస్తానంటూ గట్టిగా అరిచింది. చివరికి అర్ధరాత్రి తర్వాత మృతదేహాలను మార్చురీకి తరలించారు. నిందితులను వారి ఇంట్లోనే విచారిస్తున్నారు.