కరోనా కట్టడికి మరో కీలక నిర్ణయం తీసుకోనున్న బైడెన్!

26-01-2021 Tue 06:59
  • అమెరికాలో ఇంకా పెరుగుతున్న కేసులు
  • ఈయూ సహా 26 దేశాల పౌరులపై ఆంక్షలు
  • ట్రంప్ సడలించిన ఆంక్షల అమలుకు బైడెన్ యోచన
Biden Thinks Another Travel Ban

అమెరికాలో ఇంకా ప్రబలంగానే ఉన్న కరోనాను కట్టడి చేసేందుకు నూతన అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 26 యూరప్ దేశాల నుంచి వచ్చే పౌరుల ప్రయాణాలపై ఆంక్షలను విధించాలని ఆయన యోచిస్తున్నారు.

బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలపైనా ఆయన ఇదే నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని శ్వేత సౌధం వర్గాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికాలో కొత్త రకం వైరస్ వెలుగులోకి రావడంతో ఆ దేశాన్ని కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.  

కాగా, తాను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగిపోయే చివరి రోజుల్లో డొనాల్డ్ ట్రంప్, అప్పటి వరకూ అమలులో ఉన్న ట్రావెల్ ఆంక్షలను తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటంతో, తిరిగి ఆంక్షలను విధించేందుకు బైడెన్ సమాయత్తం అవుతున్నారు.