ఆ షాట్ ఆడతావా?: పుజారాకు అశ్విన్ సరదా సవాల్

26-01-2021 Tue 06:50
  • ఇంగ్లండ్ స్పిన్నర్ల బౌలింగ్ లో ముందుకు రావాలి
  • బౌలర్ తల మీదుగా భారీ షాట్ కొట్టాలి
  • సగం మీసం తీసేసి ఆడతానన్న అశ్విన్
Ashwin Challenge to Pujara

త్వరలో ఇంగ్లండ్ జట్టు, భారత పర్యటనకు రానుండగా, ఇరు జట్ల ఆటగాళ్ల మధ్యా ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. 2018లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లగా, సౌతాంప్టన్ లో మోయిన్ అలీ వికెట్లు తీసిన పిచ్ పై అశ్విన్ విఫలం కావడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.

తాజాగా నాటి ఘటనలపై అశ్విన్ స్పందించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా బౌలింగ్ చేశారని, వారిని కామెంటేటర్ గా ఉన్న వార్న్ సైతం ప్రశంసించారని గుర్తు చేసుకుంటూ, తాను కూడా అలాగే బౌలింగ్ చేయాలని ఏమీ లేదని అన్నాడు.

గత సిరీస్ లో అడిలైడ్ లో తన పొత్తి కడుపులో గాయమైనా, పట్టుదలగా ఆడానని, ఆరు వికెట్లు కూడా తీశానని గుర్తు చేసుకున్నాడు. అయినా, మ్యాచ్ తరువాత లయన్ బాగా బౌలింగ్ చేశాడని చెప్పుకున్నారని, ఇలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం తనను బాధించిందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తన ఆలోచనలు వేరేగా ఉండనున్నాయని, ఇక మీదట లయన్ తో పోటీ పడటం కంటే, స్టీవ్ స్మిత్ తో పోటీపడతానని అన్నాడు.

ఇక ఇదే సమయంలో తన సహచర ఆటగాడు ఛటేశ్వర్ పుజారాకు అశ్విన్ ఓ సరదా సవాల్ విసిరాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లు జరిగే సమయంలో మొయిన్ అలీ సహా మరే స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్న సమయంలోనైనా, పిచ్ పై ముందడుగు వేసి, బౌలర్ తలపై నుంచి భారీ షాట్ కొట్టాలని సవాల్ విసిరాడు. తన సవాల్ లో పుజారా విజయవంతమైతే, తాను సగం మీసం తీసేసి మరీ మ్యాచ్ ఆడతానని సరదాగా అన్నాడు.