Kamala Harris: తనకు ఇచ్చిన ఇంటిని వదిలేసి... అధ్యక్షుడి గెస్ట్ హౌస్ లో ఉంటున్న కమలా హారిస్!
- వైట్ హౌస్ కు 6 కిలోమీటర్ల దూరంలో గెస్ట్ హౌస్
- అధికారిక నివాసంలో మరమ్మతులు
- కొంతకాలం గెస్ట్ హౌస్ లోనే ఉండనున్న కమలా హారిస్
అమెరికాలో తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన కమలా హారిస్, తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని వదిలేసి, అధ్యక్షుడి గెస్ట్ హౌస్ లో నివాసం ఉండాలని నిర్ణయించారు. దీనికి కారణాన్ని కమలా హారిస్ ముఖ్య అధికార ప్రతినిధి సిమోన్ సాండర్స్ తెలిపారు. కమలా హారిస్ కు వైస్ ప్రెసిడెంట్ భవనాన్ని కేటాయించారు. ఇది వైట్ హౌస్ కు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే, అక్కడ కొన్ని మరమ్మతు పనులు సాగుతున్నాయి.
దీంతో ఆమె కొంతకాలం పాటు అధ్యక్షుడి గెస్ట్ హౌస్ లో ఉండాలని నిర్ణయించారు. ఈ భవంతి పేరు బ్లెయిర్ హౌస్. దీన్ని 1824లో నిర్మించగా, 1942లో ప్రెసిడెంట్ గెస్ట్ హౌస్ గా మార్చారు. ఈ భవంతిలో సాధారణ పరిస్థితుల్లో అయితే, ఇతర దేశాల నుంచి వచ్చే దేశాధినేతలు బస చేస్తారు. గతంలో మన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇక్కడే విడిది చేశారు. ప్రస్తుతం ఆ భవంతిలోనే కమలా హారిస్ కుటుంబం నివాసం ఉంటోంది.