కలిసి ఉండాలన్నదే మా అభిమతం: ఉత్తరప్రదేశ్ విభజనపై యోగి ఆదిత్యనాథ్

26-01-2021 Tue 06:31
  • యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని  మాయావతి ప్రతిపాదన
  • ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్న యోగి
  • విభజనపై తేల్చేసిన ముఖ్యమంత్రి
No plans at govt to bifurcate UP as four states says yogi adityanath

ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొట్టిపడేశారు. తమకైతే రాష్ట్రాన్ని విభజించే ఉద్దేశం లేదని, విభజన కంటే కలిసి ఉండడానికే తాము ఇష్టపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని బుందేల్‌ఖండ్, పూర్వాంచల్, అవద్ ప్రదేశ్, హరితప్రదేశ్‌గా మార్చాలని 2011లో మాయావతి నేతృత్వంలోని అప్పటి బీఎస్‌పీ ప్రభుత్వం ప్రతిపాదించింది. తాము అధికారంలోకి వస్తే యూపీని విభజిస్తామని అప్పట్లో బీజేపీ కూడా హామీ ఇచ్చింది.

తాజాగా, రాష్ట్ర విభజనపై అడిగిన ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి యోగి బదులిస్తూ రాష్ట్ర విభజనకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదన్నారు. కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. తమ చరిత్రను చూసి యూపీ ప్రజలు ఎంతో గర్వపడతారని, దేశంలోనే రాష్ట్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు.