KP Sharma Oli: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిని పార్టీ నుంచి బహిష్కరించిన ఎన్‌సీపీ

  • గతేడాది పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని ఓలి
  • రెండు వర్గాలుగా విడిపోయిన కమ్యూనిస్ట్ పార్టీ
  • పార్టీ చైర్మన్ పదవి నుంచి ఓలి తొలగింపు
Nepal PM Expelled From Ruling Party Amid Political Chaos

అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సీపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలి (కేపీ శర్మ ఓలి)ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌కాజీ శ్రేష్ఠ నిన్న తెలిపారు. గత నెల 20న పార్లమెంటును రద్దు చేసిన ప్రధాని ఓలి.. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఆయన నిర్ణయంతో పుష్పకమల్ దహల్, ఓలి వర్గాలుగా పార్టీ చీలిపోయింది. ప్రధాని నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న దహల్ వర్గం నిన్న సమావేశమైంది. అనంతరం ఓలిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓలి ప్రత్యర్థి వర్గ నేత మాధవ్ కుమార్ నేపాల్ మాట్లాడుతూ.. అధికార ఎన్‌సీపీ చైర్మన్ పదవి నుంచి ఓలిని తొలగించినట్టు చెప్పారు.

ఆయనిక పార్టీలో సభ్యుడు కాదు కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధాని తన తప్పును తెలుసుకుని సరిదిద్దినా ఆయనతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. కాగా, రెండుగా చీలిపోయిన కమ్యూనిస్ట్ పార్టీపై పూర్తి హక్కు తమకే ఉంటుందని ఇరు వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.

More Telugu News