Venkatramireddy: నాపై నిఘా వేయాలంటూ డీజీపీకి ఎస్ఈసీ లేఖ రాయడం సరికాదు: ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి

  • నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డి
  • వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి లేఖ రాసిన ఎస్ఈసీ
  • తన వ్యాఖ్యలపై తాజాగా వివరణ ఇచ్చిన ఉద్యోగ సంఘం నేత
  • రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడానని వెల్లడి
Venkatramireddy clarifies over his remarks on Panchayat Elections

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఏపీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి స్పందించారు. తనపై నిఘా వేయాలంటూ రాష్ట్ర డీజీపీకి ఎస్ఈసీ లేఖ రాయడం సరికాదని అన్నారు. నా ప్రాణాలకు రక్షణ కావాలని డీజీపీని కోరతాను అని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించే నిన్న తాను మాట్లాడానని, ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు.

ఎన్నికల సంఘానికి, సర్కారుకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఉద్యోగులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ఠ పాల్జేయాలన్నదే ఎస్ఈసీ అభిమతంగా కనిపిస్తోందని, కరోనా లేని రోజుల్లో స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఉద్యోగులను అడ్డంపెట్టుకుని పలు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.

నిన్న వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎదుటివారి ప్రాణాలు తీసే హక్కును కూడా రాజ్యాంగం ఇచ్చిందంటూ వ్యాఖ్యానించగా, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. తనకు ప్రాణహాని ఉందంటూ వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

More Telugu News