సుప్రీంకోర్టులో రేపు ఏపీ పంచాయతీ ఎన్నికలపై విచారణ... ధర్మాసనం మార్పు!

24-01-2021 Sun 15:16
  • సుప్రీంకు చేరిన ఏపీ పంచాయతీ ఎన్నికల వివాదం
  • ఎన్నికలు జరపాలన్న ఏపీ హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కారు
  • కేవియట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
Supreme Court will hear AP Panchayat Elections petitions on tomorrow

ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. అయితే, ఈ పిటిషన్ ను తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం విచారిస్తుందని నిర్ణయించినా, అందులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడా పిటిషన్ విచారణ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి బదిలీ అయింది.

సుప్రీంకోర్టులో రేపు విచారణ జాబితాలో ఏపీ ప్రభుత్వ పిటిషన్ తో పాటు ఉద్యోగ సంఘాల పిటిషన్లు కూడా ఉన్నాయి.  గతంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆఫీసులో పనిచేసిన న్యాయవాది శ్రీధర్ రెడ్డి  ఉద్యోగ సంఘాల తరపున వాదించడానికి గాను  పిటిషన్ వేసినందువలన "నాట్ బిఫోర్ మి" సంప్రదాయం ప్రకారం..  విచారణ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనానికి బదిలీ అయింది.

కాగా, ఏపీలో ఎన్నికలు వద్దంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఆదేశించింది. ఈ తీర్పుపై రాష్ట్ర సర్కారు సుప్రీంకు వెళ్లగా, ఎస్ఈసీ అంతకుముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంలో రేపటి విచారణ ఆసక్తికరంగా ఉండనుంది.