Rajasthan: మహిళకు 5 నెలల్లో 31 సార్లు కరోనా పాజిటివ్!

  • ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో 14 సార్లు.. యాంటీజెన్ టెస్టుల్లో 17 సార్లు పాజిటివ్
  • తొలిసారి ఆగస్టు 24న కరోనా.. అప్పట్నుంచి పాజిటివ్
  • ఎవరూ లేకపోవడంతో కుంగుబాటుకు లోనైన మహిళ
  • పొట్ట, పేగుల్లో చనిపోయిన వైరస్ ఉండి ఉండొచ్చంటున్న వైద్యులు
Bharatpur woman tests positive for Covid 31 times since August

కొన్నేళ్ల క్రితమే కట్టుకున్నవాడు చనిపోయాడు.. ఇన్నాళ్లూ ఆమె బాగోగులు చూసుకున్న అమ్మానాన్న కూడా ఇటీవలే మరణించారు.. మిగిలిన అన్నావదినలు ఆమెను తీసుకెళ్లి అప్నా ఘర్ అనే స్వచ్ఛంద సంస్థలో వదిలేశారు. దీంతో ఆమె మానసికంగా చాలా కుంగిపోయింది. ఆ బాధలే అనుకుంటే మాయదారి కరోనా మరింత బాధపెట్టింది.

ఆగస్టు 24న ఆమె దాని బారిన పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 5 నెలల్లో టెస్ట్ చేసిన ప్రతిసారీ పాజిటివ్ వస్తూనే ఉంది. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో 14 సార్లు.. యాంటీజెన్ టెస్టుల్లో 17 సార్లు.. మొత్తంగా 31 సార్లు కరోనా పాజిటివ్ అన్న రిపోర్టే వచ్చింది.

ఈ దారుణ పరిస్థితి రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన శారదా దేవి అనే 32 ఏళ్ల మహిళకి ఎదురైంది. ఇప్పటికే మానసికంగా కుంగిపోయిన ఆమెకు రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసే మరో జబ్బు కూడా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్ లో పెట్టినట్టు అప్నా ఘర్ వ్యవస్థాపకుడు బ్రిజ్ మోహన్ భరద్వాజ్ చెప్పారు. పాజిటివ్ రాగానే ఆమెను కరోనా చికిత్స కోసం భరత్పూర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు.

ఆమె మానసికంగా కుంగిపోవడంతో ఆమెను చూసుకునేవాళ్లు ఎవరైనా ఉంటేనే ట్రీట్ మెంట్ చేస్తామంటూ ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, దీంతో వేరే దారి లేక మళ్లీ ఆశ్రమానికి తీసుకొచ్చామని చెప్పారు. తమ ఆశ్రమంలో వైద్య సదుపాయాలు, టెస్టింగ్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. తాము సొంతంగానే ఆమెకు యాంటీజెన్ టెస్టులు చేస్తున్నామని, 17 సార్లు పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

మొత్తం 15 సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే.. మధ్యలో ఒక్కసారి అక్టోబర్ 15న మాత్రమే ఆమెకు నెగెటివ్ వచ్చిందని భరత్ పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కప్తాన్ సింగ్ చెప్పారు. ఆమెకు అసలు లక్షణాలే లేవని, ఆమె పొట్ట, పేగుల్లో చనిపోయిన వైరస్ కణాలు ఉండి ఉంటాయని, దాని వల్లే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ వస్తుండొచ్చు అని చెప్పారు. ఆమె నుంచి ఎదుటివారికి కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువేనని ఆయన తెలిపారు.

More Telugu News