COVAXIN: మరో ఏడు రాష్ట్రాలకు భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్‌​

Seven more states to get Covaxin from next week
  • వచ్చే వారం నుంచి పంపిణీ చేస్తామన్న కేంద్రం
  • వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కేసులు 123 అని వెల్లడి
  • అందులో ఆరుగురు చనిపోయారన్న ఆరోగ్యశాఖ
  • వారి మరణానికి వ్యాక్సిన్ కారణం కాదని స్పష్టీకరణ
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌ ను మరో ఏడు రాష్ట్రాల్లో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పంజాబ్, ఛత్తీస్ గఢ్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ లో వచ్చే వారం నుంచి కొవాగ్జిన్ ను ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కాగా, శనివారం లక్షా 46 వేల 598 మందికి వ్యాక్సిన్ వేశారు. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.37 లక్షలకు చేరింది.

ఇప్పటిదాకా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చిన ఘటనలు 123 నమోదు కాగా.. శనివారం ఒక్కటి కూడా రాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఘటనల్లో 11 మందికి మాత్రమే పరిస్థితి విషమించిందని, ఆరుగురు చనిపోయారని వెల్లడించింది.

అయితే, వారి మరణానికి కరోనా వ్యాక్సిన్లు కారణం కాదని పోస్ట్ మార్టం ద్వారా తేలిందని వివరించింది. గుర్గావ్ కు చెందిన 56 ఏళ్ల మహిళకు పోస్ట్ మార్టం చేయగా.. గుండె–ఊపిరితిత్తుల వ్యాధి వల్లే చనిపోయినట్టు తేలిందని పేర్కొంది.
COVAXIN
COVID19

More Telugu News