గుంటూరు జిల్లాలో టీకా తీసుకుని బ్రెయిన్ డెడ్ కు గురైన ఆశా కార్యకర్త!

24-01-2021 Sun 06:58
  • గత బుధవారం టీకా తీసుకున్న విజయలక్ష్మి
  • ఆపై మగత, వాంతులు రావడంతో జీజీహెచ్ కి తరలింపు
  • బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ వచ్చిందన్న వైద్య వర్గాలు
Aasha Worker Brain Dead after Vaccine

గుంటూరులో కరోనా టీకా తీసుకున్న ఓ ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్ కావడం కలకలం రేపింది. తాడేపల్లి పీహెచ్సీ పరిధిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశా కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)లకు ఈ నెల 20న వ్యాక్సిన్ వేశారు. టీకా తీసుకున్న తరువాత లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్ వచ్చాయి. విజయలక్ష్మిలో మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఇద్దరినీ 22వ తేదీన గుంటూరు జీజీహెచ్ కి చికిత్స నిమిత్తం తరలించారు.

లక్ష్మి చికిత్స తరువాత సాధారణ స్థితికి చేరుకున్నారని, త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేయనున్నామని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో శనివారం రాత్రి విజయలక్ష్మి బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ కు గురైనట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి వుంది. కాగా, విజయలక్ష్మికి వేసిన టీకా వయల్ నుంచే మరో డాక్టర్ కు వ్యాక్సిన్ వేసినా, అతనిలో ఎటువంటి రియాక్షన్ రాలేదని తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, జీజీహెచ్ కి చేరుకుని ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరికి ఏ టీకా వేరియంట్ ను ఇచ్చారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.