వైసీపీ ఉద్యోగ వ్యతిరేక విధానాల ముందు కరోనా వైరస్ ఎంత?: అచ్చెన్నాయుడు

23-01-2021 Sat 17:12
  • స్థానిక ఎన్నికలను వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు
  • వైసీపీ ఎందుకు భయపడుతోందన్న అచ్చెన్న
  • ప్రజాబలం ఉంటే ఎందుకు వెనుకంజ వేస్తున్నారంటూ వ్యాఖ్యలు
  • ఎన్నికలంటే జ్వరం పట్టుకున్నట్టుందని ఎద్దేవా
Atchannaidu slams YCP government over Panchayat elections

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వైసీపీ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయం? అని ప్రశ్నించారు. ప్రజలు బుద్ధి చెబుతారన్న భయంతోనే తమ తోలుబొమ్మ కనకరాజన్ ను నాడు ఎస్ఈసీగా తీసుకువచ్చారని విమర్శించారు.

స్వేచ్ఛాయుత ఎన్నికలంటే వైసీపీకి జ్వరం పట్టుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని, కోర్టులను ధిక్కరించే వారిపై ఎస్ఈసీ, గవర్నర్ చర్యలు తీసుకుని రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.  ప్రజాబలం వైసీపీకే ఉన్నట్టయితే ఎస్ఈసీ పట్ల ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

ఎస్ఈసీకి ఉద్యోగులు సహకరించబోరని మంత్రి పెద్దిరెడ్డి అనడం రాజ్యాంగ విరుద్ధం అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు కరోనా వ్యాక్సినేషన్ ను ఓ కుంటిసాకుగా చూపుతున్నారని, వైసీపీ సర్కారు ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాల ముందు కరోనా వైరస్ ప్రభావమెంత? అని వ్యాఖ్యానించారు. "ఉద్యోగుల జీతాల్లో కోత కోశారు, డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్ సీ ఇవ్వలేదు, సీపీఎస్ రద్దు చేయలేదు" అని వెల్లడించారు.