ప్రభాస్ సినిమా అప్ డేట్ గురించి స్పందించిన దర్శకుడు నాగ్ అశ్విన్!

23-01-2021 Sat 16:49
  • షురూ అయిన 'సలార్', 'ఆదిపురుష్'ల నిర్మాణం 
  • వైజయంతీ మూవీస్ నుంచి రాని అప్ డేట్
  • దర్శకుడు నాగ్ అశ్విన్ ని ప్రశ్నించిన ఫ్యాన్స్
  • ఈ 29న, ఫిబ్రవరి 26న అప్ డేట్ ఉందంటూ జవాబు  
Nag Ashvin gives info on update

'రాధే శ్యామ్' సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు భారీ చిత్రాలను సెట్ చేసుకున్న సంగతి విదితమే. వీటిలో ఒకటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్'. ఇటీవలే ఈ చిత్రం షూటింగు హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది.

మరొకటి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందే 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ఇటీవలే మొదలయ్యాయి.

ఇక మూడో సినిమా వైజయంతీమూవీస్ నిర్మించే భారీ చిత్రం. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ స్టార్ దీపికా పదుకొణే  హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్టుతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఏదైనా సంక్రాంతికి వస్తుందని ప్రభాస్ అభిమానులు భావించారు.

అయితే, సంక్రాంతి గడిచిపోయినా రాకపోవడంతో అభిమానులు దర్శకుడు నాగ్ అశ్విన్ ను సోషల్ మీడియా ద్వారా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఓ అభిమాని ప్రశ్నకు నాగ్ అశ్విన్ తాజాగా స్పందించాడు. 'కచ్చితంగా చెప్పాలంటే.. జనవరి 29న, ఫిబ్రవరి 26న అప్ డేట్స్ వస్తాయంటూ' జవాబిచ్చాడు. దీంతో ఆ అప్ డేట్ ఏమిటా? అని ఇప్పుడు అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.