ట్రంప్ అభిశంసనపై సోమవారం సెనేట్‌లో విచారణ ప్రారంభం!

23-01-2021 Sat 10:36
  • మరింత సమయం కావాలంటున్న రిపబ్లికన్లు
  • సోమవారమే విచారణ ప్రారంభించాలన్న పట్టుదలలో డెమోక్రాట్లు
  • అభిశంసన ఆర్టికల్‌ను ఆ రోజు నాటికి సెనేట్‌కు పంపించే ఏర్పాట్లలో నాన్సీ పెలోసీ
Nancy Pelosi vows action on Trumps impeachment trial

అమెరికా తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై ఎల్లుండి (సోమవారం) సెనేట్‌లో విచారణ ప్రారంభం కానుంది. ఆ రోజు నాటికి అభిశంసన ఆర్టికల్‌ను సెనేట్‌కు పంపాలని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భావిస్తున్నారు. అయితే, సెనేట్‌లో విచారణకు మరింత సమయం కావాలని రిపబ్లికన్ నేత మెక్ కానెల్ డిమాండ్ చేస్తున్నారు. డెమోక్రాట్లు మాత్రం సోమవారమే విచారణ ప్రారంభించాలని పట్టుదలగా ఉన్నారు. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఈ నెల 13న ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్లు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అత్యధికశాతం మంది సభ్యులు  మద్దతు పలకడంతో అభిశంసన తీర్మానానికి ఆమోద ముద్ర పడింది.