మృతి చెందిన భర్త వీర్యంపై సర్వహక్కులు భార్యవే: తేల్చి చెప్పిన కల‌కత్తా హైకోర్టు

23-01-2021 Sat 09:32
  • తలసేమియాతో బాధపడుతున్న వ్యక్తి
  • వీర్యం సేకరించి ఆసుపత్రిలో భద్రపరిచిన భార్య
  • వీర్యం ఇప్పించాలంటూ కోర్టుకెక్కిన తండ్రి
Only wife Having Right Over Dead Mans Frozen Sperm

భర్త నుంచి సేకరించి భద్రపరిచిన వీర్యంపై సర్వహక్కులు భార్యకే ఉంటాయని, ఈ విషయంలో తండ్రికి ఎలాంటి హక్కులు ఉండబోవని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. భర్త మరణించే వరకు అతడితో వైవాహిక బంధాన్ని కొనసాగించడం వల్ల, అతడి వీర్యంపై అన్ని హక్కులు భార్యకే ఉంటాయని తేల్చి చెప్పింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన వ్యక్తికి తలసేమియా వ్యాధి ఉండడంతో  భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు వీలుగా అతడి నుంచి వీర్యాన్ని సేకరించి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అతడు మరణించాడు. దీంతో భద్రపరిచిన కుమారుడి వీర్యాన్ని సొంతం చేసుకునేందుకు అతడి తండ్రి ప్రయత్నించాడు. ఇచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. అతడి భార్య అనుమతి కూడా ఉంటే తప్ప ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

దీంతో ఆయన కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. కుమారుడి వీర్యాన్ని ఇప్పించాలని వేడుకున్నాడు. విచారించిన న్యాయస్థానం అలా ఇవ్వడం కుదరదని పేర్కొంది. కుమారుడి వీర్యాన్ని తీసుకునేందుకు పిటిషనర్‌కు ఎలాంటి ప్రాథమిక హక్కు లేదని జస్టిస్ సవ్యసాచి భట్టాచార్య తీర్పు చెప్పారు. భద్ర పరిచిన వీర్యం మృతుడిదని, భర్త మరణించే వరకు అతడితో వైవాహిక సంబంధాన్ని కొనసాగించింది కాబట్టి దానిపై సర్వ హక్కులు భార్యకే ఉంటాయన్నారు. ఈ విషయంలో ఎలాంటి ప్రాథమిక, చట్టబద్ధ హక్కుల ఉల్లంఘన లేదని, కాబట్టి ఈ అంశం న్యాయస్థానాల పరిధిలోకి రాదని కోర్టు స్పష్టం చేసింది.