శివమొగ్గలో మిస్టరీగా మారిన భారీ పేలుడు.. 8 మంది మృతి

22-01-2021 Fri 07:41
  • 20 కిలోమీటర్ల మేర వినిపించిన పేలుడు శబ్దం
  • దెబ్బతిన్న సమీపంలోని భవనాలు
  • భూకంప భయంతో పరుగులు తీసిన జనం
  • పేలుడు ప్రాంతానికి వెళ్లేందుకు జంకుతున్న పోలీసులు
8 Dead In Blast At Quarry In Karnatakas Shivamogga

కర్ణాటకలోకి శివమొగ్గ పట్టణంలో గత రాత్రి 10.15 గంటల సమయంలో జరిగిన భారీ పేలుడులో 8 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. వీరంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులుగా భావిస్తున్నారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు చాలా దూరం వరకు ఎగిరి పడ్డాయి. పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. పేలుడు శబ్దం దాదాపు 20 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఓ క్వారీలో ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుడు సమయంలో భూ ప్రకంపనలు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండగా పోలీసులు తోసిపుచ్చారు.

పేలుడు జరిగిన ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. బాంబ్‌స్క్వాడ్‌తో ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. కాగా, పేలుడు శబ్దంతో వణికిపోయిన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. దెబ్బ తిన్న తమ ఇళ్ల ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

శివమొగ్గకు ఐదారు కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించినట్టు అదనపు డిప్యూటీ కమిషనర్ అనురాధ తెలిపారు. శివమొగ్గ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ట్రక్కు పేలుడు కారణంగా ధ్వంసమైందని పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. అయితే, ట్రక్కులో ఉన్న పేలుడు పదార్థాలు పేలడం వల్ల ఈ ఘటన జరిగిందా? లేక, పేలుడులో ట్రక్కు ధ్వంసమైందా? అన్న విషయం తెలియరాలేదని అన్నారు. పేలుడు సంభవించిన ప్రదేశంలో మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అయితే, ఆ ప్రాంతానికి వెళ్లేందుకు పోలీసులు కూడా జంకుతున్నారు. బాంబ్ స్క్వాడ్‌‌ను రప్పించి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు.