నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి దుర్మరణం

21-01-2021 Thu 20:14
  • అంగడిపేట వద్ద లారీని ఢీకొన్న ఆటో
  • డ్రైవర్, ఐదుగురు మహిళల మృతి
  • వరినాట్లు వేసి వస్తుండగా ప్రమాదం
  • ప్రమాద సమయంలో ఆటోలో 21 మంది!
  • సుద్దబావి తండాలో విషాదం
Fatal road accident in Nalgonda district

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. కూలీలతో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆటో డ్రైవర్, మరో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఆటోలో ప్రయాణిస్తున్నవారిని సుద్దబావి తండాకు చెందినవారిగా గుర్తించారు. వీరు వరినాట్ల నిమిత్తం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఓ బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని గుద్దేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో చెన్నంపేట మండలం సుద్దబావి తండా శోకసంద్రాన్ని తలపిస్తోంది.