Dragan Fruit: చైనాను తలపిస్తోందంటూ డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చేసిన గుజరాత్ ప్రభుత్వం

Gujarat government renames Dragan Fruit as Kamalam
  • భారత్ లో పెరుగుతున్న డ్రాగన్ ఫ్రూట్ అమ్మకాలు
  • ఆ పండుకు చైనా సంబంధిత పేరు ఎందుకున్న గుజరాత్ సీఎం
  • కమలం అంటూ కొత్తగా నామకరణం
  • కలువపువ్వు ఆకారంలో ఉందని వెల్లడి
  • ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టీకరణ
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో భారత జవాన్లు మరణించిన తర్వాత చైనా అంటే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా, చైనా తయారీ వస్తు బహిష్కరణ ఓ ఉద్యమం తరహాలో సాగింది. తాజాగా గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందుకు పరాకాష్ఠ అని చెప్పాలి.

కొంతకాలంగా భారత మార్కెట్లో విదేశీ పండ్లు దర్శనమిస్తున్నాయి. వాటిలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో ఆరోగ్య నిపుణులు వీటిని తినాలని సూచిస్తుండడంతో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే, ఈ డ్రాగన్ ఫ్రూట్ పేరు చైనాను తలపించేలా ఉందంటూ గుజరాత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండు కమలం పువ్వు ఆకారంలో ఉందంటూ 'కమలం' అని కొత్తగా నామకరణం చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో డ్రాగన్ ఫ్రూట్ ను కమలం అని పిలవాలని ఆదేశించింది.

దీనిపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. ఆ పండుకు డ్రాగన్ ఫ్రూట్ అనే చైనా సంబంధిత పేరు ఉండడం సమంజసంగా లేదని, అందుకే కమలం అనే సంస్కృత నామధేయాన్ని ఖరారు చేశామని చెప్పారు. ఆ ఫలం కమలం పువ్వు ఆకారాన్ని పోలి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
Dragan Fruit
Gujarath
Kamalam
China
India

More Telugu News