'సర్కారు వారి పాట'కు రెడీ అయిన మహేశ్.. దుబాయ్ కి పయనం!

21-01-2021 Thu 16:55
  • పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట'
  • బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సాగే కథ 
  • దుబాయ్ లో నెలరోజుల పాటు తొలి షెడ్యూలు 
  • ఫ్యామిలీతో కలసి బయలుదేరిన మహేశ్  
Mahesh leaves for Dubai

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన మహేశ్ బాబు తాజా సినిమా షూటింగ్ ఎట్టకేలకు ఇక మొదలవుతోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట' పేరిట ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలవ్వాలి. అయితే, కరోనా నేపథ్యంలో ముందుగా అనుకున్న అమెరికా షెడ్యూలు ప్రారంభం కాలేదు. యూనిట్ సభ్యులకి వర్క్ పర్మిట్లు లభించడంలో జాప్యం జరగడంతో ఆ షెడ్యూలు ప్రస్తుతానికి కేన్సిల్ చేసుకున్నారు.

ఈ క్రమంలో తొలి షెడ్యూలు షూటింగును దుబాయ్ లో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ అక్కడ మొదలవుతుంది. సుమారు నెల రోజుల భారీ షెడ్యూలును అక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్య సన్నివేశాలను, కొన్ని పాటలను కూడా అక్కడ షూట్ చేస్తారట.

దీంతో మహేశ్ తన కుటుంబ సభ్యులతో కలసి తాజాగా దుబాయ్ కి బయలుదేరినట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు మహేశ్ భార్య నమ్రత జన్మదినం కావడంతో అక్కడ సెలెబ్రేట్ చేసుకుంటారు. అనంతరం మహేశ్ ఈ సినిమా షూటింగులో జాయిన్  అవుతారని, కుటుంబ సభ్యులు ఇండియాకు తిరిగి వచ్చేస్తారని సమాచారం.

ఇక ఈ 'సర్కారు వారి పాట' సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న బ్యాంకు కుంభకోణాల నేపథ్యంతో ఈ చిత్రకథ సాగుతుంది.