తెలంగాణ ఏమీ పాకిస్థాన్ లో లేదు... కేంద్రం అందరినీ సమానంగా చూడాలి: తలసాని

21-01-2021 Thu 16:30
  • కేంద్రంపై ధ్వజమెత్తిన తలసాని
  • తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమేనంటూ వ్యాఖ్యలు
  • ఏడవడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని కామెంట్ 
  • కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్న తలసాని
Talasani slams Central government

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్రంపై ధ్వజమెత్తారు. కరోనా సమయంలో కేంద్రం తెలంగాణను ఆదుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఏమీ పాకిస్థాన్ లో లేదని, తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమేనని బీజేపీ నేతలు గుర్తించాలని అన్నారు. కేంద్రం అందరినీ సమదృష్టితో చూడాలని అన్నారు.

 రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే తమపై ఏడవడం తప్ప తెలంగాణకు బీజేపీ చేసింది ఏమైనా ఉందా? అని తలసాని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని తిడితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఏమొస్తుందని నిలదీశారు. కరీంనగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి రాష్ట్రం నుంచి భారీగా నిధులు వెళుతున్నా, కేంద్రం నుంచి అందులో సగం కూడా రాష్ట్రానికి నిధులు అందడంలేదని ఆరోపించారు. తమపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు.