మహారాష్ట్రలోనూ ఆప్​ సత్తా.. పంచాయతీ ఎన్నికల్లో 96 స్థానాల్లో గెలుపు

20-01-2021 Wed 14:09
  • 13 జిల్లాల్లోని 300 స్థానాల్లో పోటీ
  • అత్యధికంగా యవత్మాల్ లో 41 సీట్లలో జయకేతనం
  • రాజకీయేతర సంస్థలతో కలిసి మరో 13 స్థానాలు కైవసం
  • ఎక్కువ సీట్లు తామే గెలిచామంటూ బీజేపీ, ఎన్సీపీ ప్రకటనలు
AAP Sweeps in Maharashtra wins 96 seats in panchayat elections

ఇతర రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన బలాన్ని ప్రదర్శిస్తోంది. ఇంతకుముందూ వేరే రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉన్నా.. ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ, ఇప్పుడు చాప కింద నీరులా మెల్లగా విస్తరిస్తోంది. అందుకు మహారాష్ట్ర ఎన్నికలే నిదర్శనం. అక్కడ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 96 సీట్లు సాధించి సత్తా చాటింది.

ఇక్కడ ఇంకో విశేషమేంటంటే.. మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో ఖాతా తెరిచింది ఆ పార్టీ. విజయం సాధించిన 96 స్థానాల్లో 41 స్థానాలను ఒక్క యవత్మాల్ జిల్లా నుంచే గెలుపొందడం విశేషం. 13 జిల్లాల్లోని 300 స్థానాలకు ఆప్ బరిలో నిలిచింది. లాతూర్, నాగ్ పూర్, షోలాపూర్, నాశిక్, గోండియా, చంద్రాపూర్, పాల్ఘర్, హింగోలి, అహ్మద్ నగర్, జల్నా, యవత్మాల్, పర్భానీ జిల్లాల్లో గెలుపు ఖాతా తెరిచింది. రాజకీయాలతో సంబంధం లేని సంఘాలతో జట్టు కట్టి మరో 13 స్థానాలను కైవసం చేసుకుంది. 2022 బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆప్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్నిచ్చేవే.

కాగా, 34 జిల్లాల్లోని 14 వేల గ్రామపంచాయతీలకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. అయితే, 3,276 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ ప్రకటించారు. అయితే, తాము 6 వేలకుపైగా పంచాయతీలను గెలిచామని, తామే అతిపెద్ద పార్టీ అని బీజేపీ ప్రకటించుకుంది. మహా వికాస్ అఘాడీలోని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ లు కలిపి గెలిచిన స్థానాల్లో 20 శాతం కూడా బీజేపీ గెలవలేదని పాటిల్ అన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో సర్పంచులు, వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన వారిలో లక్షా 25 వేల మంది అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు.