సరిహద్దుల్లో ముగ్గురు ముష్కరుల హతం

20-01-2021 Wed 13:49
  • భారీ ఆయుధాలతో ఐదుగురు ఉగ్రవాదుల చొరబాటు యత్నం
  • వెంటనే అప్రమత్తమై తిప్పికొట్టిన బలగాలు
  • ఐదుగురు సైనికులకూ గాయాలు
  • పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు
Three militants killed in Major infiltration bid foiled in Jammu

దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. చొరబాటు ప్రయత్నాలను తిప్పికొట్టింది. బుధవారం జమ్మూ అఖ్నూర్ లోని కేరి బత్తల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి జనవరి 18–19 మధ్య రాత్రి ఈ ఘటన జరిగిందని సైనికాధికారులు తెలిపారు. భారీ ఆయుధాలు, మందుగుండుతో ఐదుగురు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు కుట్ర పన్నారని చెప్పారు.  

ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని గమనించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయని, సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైనికులు ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పారు. ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయని వివరించారు. పారిపోయిన మరో ఇద్దరు ముష్కరుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. వారు తిరిగి సరిహద్దులు దాటైనా వెళ్లిపోయి ఉండొచ్చని లేదా అక్కడే ఎక్కడో దాక్కొని ఉండొచ్చని చెప్పారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు వివరించారు.