రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు... సీఐడీ కేసులను కొట్టివేసిన హైకోర్టు!

19-01-2021 Tue 20:22
  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ సీఐడీ కేసులు
  • క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన కిలారి రాజేశ్ తదితరులు
  • వాదనలు విన్న హైకోర్టు
  • భూములు అమ్మినవారెవరూ ఫిర్యాదు చేయలేదన్న పిటిషనర్లు
  • పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
High Court dismiss CID cases of alleged insider trading in Amaravati

ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో సీఐడీ విభాగం కిలారి రాజేశ్ సహా మరికొందరిపై కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కిలారి రాజేశ్ తదితరులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. భూములు అమ్మినవారెవరూ ఫిర్యాదు చేయలేదని పిటిషనర్లు తమ క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్ల తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు విన్నవించారు.

రాజధాని వస్తుందని తెలిసి ముందే భూములు కొన్నారన్న సీఐడీ ఆరోపణల్లో వాస్తవం లేదని వాదించారు. రాజధాని ఎక్కడన్నది బహిరంగ రహస్యమేనని, భూముల కొనుగోలులో మోసాలు జరిగినట్టు భావిస్తే రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరాలే తప్ప ఇన్ సైడర్ ట్రేడింగ్ ముద్ర వేయడం తగదని పిటిషన్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న అనంతరం పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేసింది.