బ్రిస్బేన్ టెస్ట్: విజయానికి 145 పరుగుల దూరంలో భారత్

19-01-2021 Tue 10:37
  • నిలకడగా ఆడుతున్న భారత్
  • క్రీజులో పుజారా, రిషభ్ పంత్
  • ఊరిస్తున్న విజయం
Team India stands 145 runs away to win

సిరీస్ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 145 పరుగులు అవసరం కాగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. 328 పరుగుల విజయ లక్ష్యంతో నిన్ననే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో నిన్న నాలుగు పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ముగిసింది. నేడు ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు 18 పరుగుల వద్ద రోహిత్ శర్మ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

అయితే, గిల్, పుజారాలు కలిసి జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచుకుంటూ పోయారు. అర్ధ సెంచరీ దాటి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న శుభ్‌మన్ గిల్ 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగులో పెవిలియన్ చేరి అభిమానులను నిరాశ పరిచాడు. కెప్టెన్ అజింక్య రహానే (24) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

టీ బ్రేక్ సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పుజారా 43, రిషభ్ పంత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు విజయానికి ఇంకా 145 పరుగులు అవసరం కాగా, ఆస్ట్రేలియాకు ఏడు వికెట్లు అవసరం. క్రీజులో ఉన్న ఇద్దరూ ధాటిగా ఆడితే తప్ప విజయం దాదాపు అసాధ్యం. అదే జరిగితే సిరీస్‌ను ఇరు జట్లు డ్రాతో సరిపెట్టుకోవాల్సిందే.