Aditya Singh: కరోనా భయంతో మూడు నెలలు షికాగో ఎయిర్ పోర్టులో ప్రవాస భారతీయుడు... అరెస్ట్ చేసిన పోలీసులు!

Indo American Lives in Chicago Airport with Corona Fear
  • అక్టోబర్ 19 నుంచి సెక్యూరిటీ ఏరియాలో నివాసం
  • మరో ఉద్యోగి బ్యాడ్జ్ కొట్టేసిన ఆదిత్య సింగ్
  • జాలి చూపుతూ బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
తనకు ఎక్కడ కరోనా సోకుతుందోనన్న ఆందోళనతో, మూడు నెలలుగా అమెరికా, షికాగోలోని 'ఓ హేర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు'లో రహస్యంగా తలదాచుకున్న ప్రవాస భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 'షికాగో ట్రిబ్యూన్' పత్రిక ఇందుకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, 36 సంవత్సరాల ఆదిత్య సింగ్ అనే వ్యక్తి, విమానంలో ప్రయాణించేందుకు ధైర్యం చేయలేక, గత సంవత్సరం అక్టోబర్ 19 నుంచి విమానాశ్రయంలోని సెక్యూర్ ఏరియాలో తలదాచుకున్నాడు. అతన్ని ఈ మూడు నెలల కాలంలో ఎవరూ గుర్తించలేదు.

అక్టోబర్ 19న అతను లాస్ ఏంజిల్స్ నుంచి షికాగో విమానాశ్రయానికి వచ్చాడని, అప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడని వెల్లడించిన పోలీసులు, అతనిపై నేరపూరిత కుట్ర, అనుమతిలేని ప్రదేశంలో తలదాచుకోవడం, దొంగతనం ఆరోపణలను మోపుతూ కేసును నమోదు చేశారు. ఓ సెక్యూరిటీ ఉద్యోగి బ్యాడ్జిని దొంగిలించిన ఆదిత్య, దాన్ని తగిలించుకుని అక్కడే గడిపాడు.

యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఉద్యోగి ఒకరు అతన్ని ప్రశ్నించడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. కరోనా కారణంగానే ఇంటికి వెళ్లేందుకు భయపడిన ఆదిత్య ఎయిర్ పోర్టులోనే ఉన్నాడని అసిస్టెంట్ స్టేట్ అటార్నీ క్యాథలీన్ హెగర్టీ వ్యాఖ్యానించారు. ఈ మూడు నెలలూ విమానాలు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులు వదిలి వెళుతున్న ఆహారంతోనే కాలం గడిపాడని పోలీసులు గుర్తించారు. ఇక ఈ కేసును విచారిస్తున్న కౌంటీ న్యాయమూర్తి సుసానా ఓర్టిజ్, ఆదిత్య విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఉద్యోగి కాని వ్యక్తి అంతకాలం పూర్తి భద్రతా వలయంలో ఉండే ప్రాంతంలో ఉన్నాడంటే, అక్కడి సిబ్బంది తప్పు కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదిత్యపై గతంలో ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని, ఆతిథ్య రంగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి, ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడని కూడా గుర్తించి, అతని పని హింసాత్మక చర్య కాదని కోర్టు అభిప్రాయపడింది. అతనికి రూ.1000 డాలర్ల పూచీకత్తుపై బెయిల్ ను మంజూరు చేస్తూ, మరోసారి విమానాశ్రయంలోకి రారాదని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణను జనవరి 27కు న్యాయమూర్తి వాయిదా వేశారు.
Aditya Singh
Chicago
Airport

More Telugu News