Steve Smith: 294 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్... ఇండియా టార్గెట్ 328

  • అద్భుతంగా రాణించిన సిరాజ్, శార్దూల్
  • సిరాజ్ కు 5, శార్దూల్ కు 4 వికెట్లు
  • హాఫ్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్
328 Runs Target for India in Brisbane Test

బ్రిస్బేన్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. నేడు నాలుగో రోజున రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును 294 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి ఐదు వికెట్లను పడగొట్టగా, మరో బౌలర్ శార్దూల్ ఠాకూర్ కు నాలుగు వికెట్లు దక్కాయి. వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ లభించింది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మార్కస్ 38, వార్నర్ 48, లబుషేన్ 25, స్టీవ్ స్మిత్ 55, మ్యాథ్యూ వేడ్ 0, కెమెరాన్ గ్రీన్ 37, టిమ్ పైనీ 27, మిచెల్ స్టార్క్ 1, నాథన్ లియాన్ 13, హాజల్ వుడ్ 9 పరుగులు చేసి అవుట్ కాగా, పాట్ కమిన్స్ 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని, ఆస్ట్రేలియా 327 పరుగులు చేసినట్లయింది.

ఈ మ్యాచ్ గెలవాలంటే, భారత్ ముందు దాదాపు 100కు పైగా ఓవర్లు ఉండటంతో, నిలదొక్కుకుని ఆడితే, విజయం ఏమంత అసాధ్యం కాదని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ సాధ్యమైనంత ఎక్కువసేపు నేడు క్రీజులో గడిపితే, రేపు చివరి రోజున ఏ ఇద్దరు రాణించి సెంచరీలు చేసినా, భారత్ గెలిచే అవకాశాలు ఉంటాయి.

ఇదే సమయంలో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ తిరిగి చేజిక్కించుకోవాలంటే, 10 వికెట్లు తీయాల్సిందే. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ ని డ్రా చేసుకోగలిగితే, పూర్వపు విజేత హోదాలో మరో మారు ట్రోఫీని తన వద్దే ఉంచుకోనుంది.

More Telugu News