Russia: రష్యా టీకా వినియోగానికి బ్రెజిల్ నో.. చైనా, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాలకు గ్రీన్ సిగ్నల్

  • స్పుత్నిక్ మూడో దశ ప్రయోగాలకు అనుమతులు లేవన్న బ్రెజిల్
  • టీకా తయారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపైనా అనుమానం
  • డిసెంబరులోనే అనుమతులు కోరిన క్విమికా
Brazil Rejects Russia Corona Vaccine Sputnik V

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-వి’ టీకాకు బ్రెజిల్ షాకిచ్చింది. టీకా వినియోగానికి నిరాకరించింది. అదే సమయంలో చైనాకు చెందిన సినోవాక్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

స్పుత్నిక్ టీకాకు అనుమతి ఇవ్వకపోవడంపై బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నిఘా సంస్థ అన్విసా వివరణ ఇస్తూ.. ఆ టీకా మూడో దశ ప్రయోగాలకు పూర్తిస్థాయిలో అనుమతులు లేవని తెలిపింది. టీకా తయారీలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించినట్టు చెబుతున్నా, అందులోనూ తమకు సందేహాలు ఉన్నాయని పేర్కొంది. అందుకనే అనుమతులు ఇవ్వలేదని తెలిపింది.

స్పుత్నిక్ టీకాను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) భాగస్వామ్యంతో పనిచేస్తున్న యునియావో క్విమికా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా డిసెంబరులోనే బ్రెజిల్ ప్రభుత్వానికి క్విమికా దరఖాస్తు చేసుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. కాగా, స్పుత్నిక్ టీకాకు భారత్‌లో రెడ్డీస్ ల్యాబ్ మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తోంది.

More Telugu News