COVAXIN: కొవాగ్జిన్ వద్దు... కొవిషీల్డే కావాలి: రామ్ మనోహర్ లోహియా వైద్యుల డిమాండ్!

  • రెండు టీకాలకు అనుమతించిన కేంద్రం
  • ఇంకా ట్రయల్స్ పూర్తికాని కొవాగ్జిన్
  • కొవిషీల్డ్ నే ఇవ్వాలంటున్న వైద్యులు
Doctors of Ram Manohar Lohia Hospital Demand Covishield

మూడు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్న కొవిషీల్డ్ టీకాను మాత్రమే తమకు ఇవ్వాలని, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ తమకు వద్దని న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్ చేశారు. కొవాగ్జిన్ ఇంకా మూడవ దశ ట్రయల్స్ ను పూర్తి చేసుకోలేదన్న విషయాన్ని గుర్తు చేసిన వారు, ఈ టీకాను తీసుకునేందుకు తాము వ్యతిరేకమని తేల్చి చెప్పారు. తమకు కొవాగ్జిన్ ఇస్తామంటే, తీసుకోబోమని వారు స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి ఆక్స్ ఫర్డ్ - అస్ట్రాజెనికాలు తయారు చేయగా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ ను మాత్రమే ఇవ్వాలని ఆసుపత్రి వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. "మా ఆసుపత్రిలో సీరమ్ తయారు చేసిన కొవిషీల్డ్ తో పోలిస్తే, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ను అధికంగా ఇస్తున్నారు. మేము మీ దృష్టికి ఒక విషయాన్ని తేవాలని భావిస్తున్నాం. ఈ వ్యాక్సిన్ ను మేము అంగీకరించబోము. పూర్తి ట్రయల్స్ జరిగి, సురక్షితమైనదన్న రిపోర్టులు వచ్చిన వ్యాక్సిన్ నే మాకు ఇవ్వాలి. అలా జరగకుంటే, అత్యధికులు వ్యాక్సిన్ తీసుకునేందుకు సుముఖంగా లేరు" అని డాక్టర్ షాంకుల్ ద్వివేది తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

తమకు కొవిషీల్డ్ టీకాను మాత్రమే ఇవ్వాలని కోరుతూ, వివిధ మీడియా సంఘాలకు, ఎయిమ్స్ కు, టీకా కమిటీ ప్రతినిధులకు లేఖను పంపుతూ, దాన్ని విడుదల చేశారు. కాగా, ఈ రెండు వ్యాక్సిన్లూ సురక్షితమైనవేనని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రెండు టీకాలనూ ఆమోదించిన కేంద్రం, తొలి డోస్ లో భాగంగా ఏ కంపెనీ టీకా తీసుకుంటే, రెండో డోస్ కూడా దాన్నే తీసుకోవాలని, ఏది కావాలన్న విషయాన్ని ఎంచుకునే హక్కు ఎవరికీ లేదని కేంద్రం ఇప్పటికే పేర్కొంది.

More Telugu News