టీకా తీసుకున్న తరువాత స్వల్ప ఇన్ఫెక్షన్ శుభ సంకేతమే: ఎయిమ్స్!

17-01-2021 Sun 07:12
  • ఇన్ఫెక్షన్ వచ్చిందంటే టీకాకు శరీరం స్పందించినట్టే
  • యాంటీ బాడీలు పెరుగుతున్నాయనడానికి సంకేతం
  • ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతాయన్న గులేరియా
Mild Reaction After Vaccine is Good Says AIIMS Director
కరోనా టీకాను తీసుకున్న తరువాత స్వల్పంగా ఇన్ఫెక్షన్ బారిన పడినా పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని, అది శుభ సంకేతమేనని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. తొలి రోజున వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గులేరియా కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఆపై మీడియాతో ఆయన మాట్లాడారు. కొంత ప్రతికూల రియాక్షన్ రావడం మంచిదేనని వ్యాఖ్యానించిన ఆయన, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ టీకాకు స్పందిస్తుందని చెప్పేందుకు ఇది సంకేతమని అన్నారు.

టీకా తరువాత ప్రతికూల పరిస్థితులు వస్తే, యాంటీ బాడీస్ తయారవుతున్నట్టుగా భావించవచ్చని గులేరియా అన్నారు. తాను పూర్తి స్వస్థతతో ఉండి, వ్యాక్సిన్ తీసుకున్నానని, ఆపై గంటన్నర తరువాత కూడా ఎలాంటి ప్రభావమూ తనలో కనిపించలేదని అన్నారు. ఇండియాలో ఆమోదించిన రెండు వ్యాక్సిన్లూ కరోనా విషయంలో రోగ నిరోధక శక్తిని పెంచేవేనని, సేఫ్టీ విషయంలో రాజీపడబోవని, వీటిని తీసుకునేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

కాగా, న్యూఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న మూడవ వ్యక్తిగా గులేరియా నిలిచారు. తొలి టీకా పారిశుద్ధ్య కార్మికుడు మనీశ్ కుమార్ కు, రెండో టీకా వ్యాక్సిన్ వ్యూహంపై ప్రభుత్వ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ పాల్ కు ఇవ్వగా, మూడో వ్యాక్సిన్ గులేరియాకు ఇచ్చారు. ఆపై స్వల్ప ఇన్ఫెక్షన్లపై మాట్లాడిన ఆయన, ఒళ్లు నొప్పులు, జ్వరం, కండరాల నొప్పులు ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతాయన్న భరోసాను ఇచ్చారు.

అవసరమైతే రియాక్షన్స్ వచ్చిన వారు వైద్యులను సంప్రదించి, తగిన సాయం పొందవచ్చని గులేరియా తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేశామని అన్నారు. కరోనా టీకాను తీసుకున్న తరువాత కూడా ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని ఆయన సూచించారు.