మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటా: విజయ్ సేతుపతి

16-01-2021 Sat 18:40
  • ఇటీవల సెట్లో బర్త్ డే జరుపుకున్న విజయ్ సేతుపతి
  • పెద్ద ఖడ్గంతో కేకును కట్ చేయడంపై విమర్శలు
  • ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరిన విజయ్
Actor Vijay Sethupathi apolosises for cutting cake with sword

తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన తమిళ నటుడు విజయ్ సేతుపతి బహిరంగ క్షమాపణలు చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన విధానానికి సంబంధించి క్షమాపణ కోరాడు. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల విజయ్ సేతుపతి బర్త్ డే సందర్భంగా సెట్లో వేడుకలు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా పెద్ద ఖడ్గంతో కేక్ ను కట్ చేశాడు.

దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, సేతుపతిపై పలువురు విమర్శలు గుప్పించారు. గతంలో కొందరు సంఘ విద్రోహశక్తులు ఇలాగే చేసినందుకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారని... సేతుపతికి ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. ఇది వివాదానికి దారి తీసింది.

ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రంలో ఖడ్గం కీలక పాత్రను పోషిస్తుందని... అందుకే తన చిత్ర బృందం తనతో కేక్ ను అలా కట్ చేయించిందని చెప్పాడు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరాడు.