Corona Virus: నేడు ప్రధాని చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రారంభం.. తొలి రోజు తెలంగాణలో 4,170 మందికి టీకా!

Corona Vaccination Starts Today in Telangana
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీకా లబ్ధిదారులతో మాట్లాడనున్న ప్రధాని
  • తొలి రోజు 140 కేంద్రాలలో వ్యాక్సినేషన్
  • ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా టీకా
కరోనా మహమ్మారితో అల్లాడిపోయిన దేశానికి నేటి నుంచి సాంత్వన లభించనుంది. వైరస్‌పై పోరు కోసం సిద్ధమైన టీకా పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి రోజు 140 కేంద్రాలలో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా తొలిరోజు 4,170 మంది టీకా వేస్తారు.

అంతకంటే ముందు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాంధీ ఆసుపత్రి, నార్సింగిలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, టీకా లబ్ధిదారులతో మాట్లాడతారు. అలాగే, మిగతా 138 కేంద్రాల్లోనూ ప్రధాని ప్రసంగం వినిపించనున్నారు.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిమ్స్‌లో, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రిలో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
Corona Virus
Corona Vaccination
Telangana
Narendra Modi
Gandhi Hospital

More Telugu News