అఖిలప్రియ ఫోన్ల కోసం పోలీసుల ప్రయత్నాలు... ఇంటికి తాళం వేసి ఉండడంతో కోర్టు అనుమతి కోరాలని నిర్ణయం

15-01-2021 Fri 20:47
  • సంచలనం సృష్టించిన హఫీజ్ పేట కిడ్నాప్ వ్యవహారం
  • ఏ1 నిందితురాలిగా భూమా అఖిలప్రియ
  • కిడ్నాపర్లతో ఆమె ఫోన్ లో మాట్లాడినట్టు నిర్ధారణ
  • అఖిలప్రియ ఫోన్ల డేటా కీలకమని భావిస్తున్న పోలీసులు
Police tries to seize Akhila Priya mobile phones

భూ వివాదంలో చోటు చేసుకున్న కిడ్నాప్ ఘటనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అఖిలప్రియ కిడ్నాపర్లతో ఫోన్ లో మాట్లాడినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. తన పర్సనల్ ఫోన్ కాకుండా, కిడ్నాప్ సమయంలో ఆమె ప్రత్యేకంగా మరో ఫోన్ ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు.

ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన రోజున అఖిలప్రియ విజయవాడ నుంచి హైదరాబాదులోని కూకట్ పల్లి వచ్చేవరకు రెండు సెల్ ఫోన్లలో మాట్లాడినట్టు తెలుసుకున్నారు. దాంతో ఆ రెండు ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు న్యాయపరమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నారు.

అఖిలప్రియను అరెస్ట్ చేసిన సమయంలో రెండు ఫోన్లు ఆమె నివాసంలోనే ఉండిపోయాయి. అయితే అఖిలప్రియ ఇంటికి తాళం వేసి ఉండడంతో, తెరిచేందుకు  న్యాయస్థానం అనుమతి కోరాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అఖిలప్రియ సెల్ ఫోన్ల డేటాను పరిశీలిస్తే ఈ కేసు దర్యాప్తుకు అవసరమైన కీలక సమాచారం లభ్యమవుతుందని భావిస్తున్నారు.