మమతా బెనర్జీకి షాక్ ఇవ్వబోతున్న శతాబ్ది రాయ్?

15-01-2021 Fri 18:54
  • ఇప్పటికే బీజేపీలో చేరిన పలువురు నేతలు
  • రేపు అమిత్ షాతో భేటీకానున్న శతాబ్ది రాయ్
  • ఎవరినైనా కలిసే హక్కు తనకుందని వ్యాఖ్య
Satabdi Roy to meet Amit Shah tommorrow

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బీజేపీని మట్టికరిపించాలనుకున్న ఆమెకు సొంత పార్టీ నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే టీఎంసీలో అత్యంత కీలక నేత అయిన సువేందు అధికారితో పాటు పలువురు నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. తాజాగా మరో ఎంపీ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎంపీ శతాబ్ది రాయ్ రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. దీంతో, టీఎంసీలో ప్రకంపనలు పుడుతున్నాయి. ఈ అంశంపై ఆమెను మీడియా ప్రశ్నించగా... తాను  ఒక ఎంపీనని... ఎవరితోనైనా భేటీ అయ్యే హక్కు తనకు ఉందని అన్నారు.

2009లో తాను మొదటిసారి ఎంపీ అయిన సమయంలో... ఈమె నటి, రాజకీయవేత్త కాదు, పాలిటిక్స్ లో ప్రభావం చూపలేరని చాలా మంది అన్నారని... వారి ఆలోచనలన్నీ అబద్దాలేనని తాను నిరూపించానని శతాబ్ది  అన్నారు. మమతా బెనర్జీ రోడ్ షోకు తనను ఆహ్వానించారని, ఆ సందర్భంలోనే తాను టీఎంసీలో చేరానని  తెలిపారు. మమత పిలిస్తేనే  తాను రాజకీయాల్లోకి వచ్చానని, పిలవని కార్యక్రమాలను తాను వెళ్లనని చెప్పారు.