Brisbane: బ్రిస్బేన్ టెస్టులో ముగిసిన తొలి రోజు ఆట.. ఆసీస్ 274/5

First day play ends in Brisbane test between India and Australia
  • బ్రిస్బేన్ లో నాలుగో టెస్టు ప్రారంభం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 17 పరుగులకే ఓపెనర్లు అవుట్
  • సెంచరీ సాధించిన లబుషానే
  • నటరాజన్ కు రెండు వికెట్లు
బ్రిస్బేన్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆట చివరికి 5 వికెట్లకు 274 పరుగులు చేసింది. కెప్టెన్ టిమ్ పైన్ (38), కామెరాన్ గ్రీన్ (28) క్రీజులో ఉన్నారు. అంతకుముందు, ఆట ఆరంభంలోనే ఆసీస్ వడివడిగా రెండు వికెట్లు కోల్పోయింది. 17 పరుగులకే ఓపెనర్లు వార్నర్ (1), మార్కస్ హారిస్ (5) పెవిలియన్ చేరారు.

ఆ తర్వాత మార్నస్ లబుషానే (108) సెంచరీ సాధించడం హైలైట్ గా నిలిచింది. లబుషానే 9 ఫోర్లు కొట్టాడు. అయితే, తొలి టెస్టు ఆడుతున్న నటరాజన్ బౌలింగ్ లో బంతి బౌన్స్ ను అంచనా వేయడంలో పొరబడి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 36 పరుగులు చేయగా, మాథ్యూ వేడ్ 45 పరుగులు నమోదు చేశాడు.

ఈ మ్యాచ్ ద్వారా ఎడమచేతివాటం పేస్ బౌలర్ టి.నటరాజన్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలిరోజు ఆటలో 20 ఓవర్లు విసిరిన ఈ తమిళనాడు కుర్రాడు 63 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. సిరాజ్ కు ఓ వికెట్, శార్దూల్ ఠాకూర్ కు ఓ వికెట్ లభించింది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో జట్టులోకొచ్చిన వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టాడు.
Brisbane
Test
Team India
Australia
Cricket

More Telugu News