Railway Station: విమానాశ్రయంలా ఢిల్లీ రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ!

  • రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రణాళిక
  • మొత్తం 120 హెక్టార్లలో విస్తరణకు కసరత్తులు
  • తొలిదశలో 88 హెక్టార్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్
  • ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించి ఆన్ లైన్ సదస్సులు 
RLDA to conduct virtual roadshows on the redevelopment of New Delhi Railway Station

విమానాశ్రయాలే సకల హంగులు, సొబగులతో అందంగా ఉండాలా.. రైల్వే స్టేషన్లు ఉండొద్దా! అదే ఆలోచన వచ్చింది కేంద్రానికి. విమానాశ్రయాలను తలపించేలా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అందులో భాగంగానే రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు అడుగు ముందుకేసింది. అందులో భాగమే సకల సౌకర్యాలతో రాబోతున్న ఢిల్లీలోని ఈ ఆధునిక రైల్వే స్టేషన్. దీనిని అభివృద్ధిని వివరించేందుకు రైల్వే శాఖ ఏర్పాటు చేసిన రైల్ ల్యాండ్ డెవలప్ మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) జనవరి 14 నుంచి 19 వరకు ఆన్ లైన్ లో సదస్సులు నిర్వహిస్తోంది.

అందుకు సింగపూర్, ఆస్ట్రేలియా, దుబాయ్, స్పెయిన్ వంటి దేశాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వారికి ఈ ప్రాజెక్టు గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (నిర్మాణ అనుమతులకు విజ్ఞప్తి) దశలోనే ఉంది.

‘‘ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ తో పర్యాటక రంగం అభివృద్ధి చెందడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఆన్ లైన్ సదస్సుల్లో చాలా మంది భాగస్వాములు ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపిస్తున్నారు’’ అని ఆర్ఎల్డీఏ వైస్ చైర్మన్ వేద్ ప్రకాశ్ దుదేజా అన్నారు.

కాగా, కనాట్ ప్యాలెస్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలను కలుపుతూ ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించనున్నారు. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో 60 ఏళ్ల పాటు లీజుకిచ్చేలా ప్రాజెక్టును చేబడుతున్నారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని సుమారు రూ.5 వేల కోట్లుగా లెక్కించారు. కాగా, ఇప్పటికే గతేడాది సెప్టెంబర్ లో ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించారు. అదానీ, జీఎంఆర్, జేకేబీ ఇన్ ఫ్రా, అరేబియన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ, ఎస్ఎన్ సీఎఫ్, యాంకరేజ్ తదితర సంస్థలు పాల్గొన్నాయి.

మొత్తంగా 120 హెక్టార్లలో రైల్వేస్టేషన్ ను విస్తరించనున్నారు. మొదటి దశలో 88 హెక్టార్లలో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారు. ప్రాజెక్టులో భాగంగా కొత్త టెర్మినల్ బిల్డింగ్, రైల్వే కార్యాలయాలు, రైల్వే క్వార్టర్లు, స్టేషన్ ఎస్టేట్, షాపులు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, నివాస సముదాయాల వంటి మౌలిక వసతులనూ కల్పించనున్నారు. అయితే, ప్రాజెక్టు ఎప్పుడు మొదలయ్యేది.. ఎప్పుడు పూర్తయ్యేది వంటి వివరాలను ఇంకా రైల్వే శాఖ వెల్లడించలేదు.

More Telugu News