Team India: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్: 20 మంది ఆటగాళ్లను ఆడించిన టీమిండియా.. ఇదో రికార్డు!

Team India playing with 20 cricketers in australia series
  • 1961-62 తర్వాత ఇంతమంది ఆటగాళ్లను ఆడించడం ఇదే తొలిసారి
  • ఈ సిరీస్‌లో ఆరుగురు ఆటగాళ్ల అరంగేట్రం
  • 1996లోనూ టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆరుగురు యువ క్రికెటర్లు
వన్డే, టీ20, టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో ఏ ముహూర్తాన అడుగుపెట్టిందో కానీ.. ఆటగాళ్లు వరుస గాయాలతో టెస్టు సిరీస్‌కు దూరమవుతున్నారు. తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇషాంత్ శర్మ గాయంతో జట్టుకు దూరం కాగా, ఆ తర్వాతి నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతూ వచ్చారు.

తొలి టెస్టులో గాయపడిన పేసర్ మహ్మద్ షమీ సిరీస్‌కు దూరం కాగా, ఆ తర్వాత వరుసగా ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లు గాయాల బారినపడ్డారు. ఫలితంగా వారి స్థానాలను ఇతర ఆటగాళ్లతో భర్తీ చేయాల్సి వచ్చింది.

 దీంతో ఈ సిరీస్‌లో ఆడిన ఆటగాళ్ల జాబితా 20కి పెరిగింది. ఓ సిరీస్‌లో భారత జట్టు ఇంతమంది ఆటగాళ్లను ఆడించడం 1961-62 తర్వాత ఇదే తొలిసారి. అంతకుముందు 2014-15 నాటి ఆస్ట్రేలియా పర్యటనలో, 2018 నాటి ఇంగ్లండ్ పర్యటనలో, 1959 నాటి ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు 17 మందిని ఆడించింది. ఈసారి ఏకంగా 20 మంది ఆటగాళ్లు బరిలోకి దిగారు.

 ఇక, తాజా సిరీస్‌తో మొత్తం ఆరుగురు యువ ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం విశేషం. వీరిలో శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. 1996లో ఇంగ్లండ్ పర్యటనలోనూ ఆరుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. వీరిలో సునీల్ జోషి, పరాస్ మాంబ్రే, వెంకటేశ్ ప్రసాద్, విక్రమ్ రాథోడ్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ ఉన్నారు.
Team India
Australia
Cricket
Test series

More Telugu News