ప్రైవసీ పాలసీ తెచ్చిన తంటా... స్పందించిన వాట్సాప్

14-01-2021 Thu 21:55
  • కొత్త ప్రైవసీ పాలసీ తీసుకువచ్చిన వాట్సాప్
  • యూజర్లు అసంతృప్తి చెందుతున్నారంటూ ప్రచారం
  • సిగ్నల్, టెలిగ్రామ్ వైపు చూస్తున్నారని వార్తలు
  • వాస్తవం లేదన్న వాట్సాప్
  • కేంద్రానికి జవాబిస్తామని వివరణ
Whatsapp responds to updated privacy policy issue

యూజర్లు తమ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సిందేనని పట్టుబడుతున్న సోషల్ నెట్వర్కింగ్ యాప్ వాట్సాప్ తాజా పరిణామాలపై స్పందించింది. కొత్తగా విడుదల చేసిన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు వివరణ ఇస్తామని వాట్సాప్ వెల్లడించింది. భారత్ లో తమ యూజర్ల ప్రైవసీకి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తామని వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాత్ కార్ట్ స్పష్టం చేశారు. మున్ముందు ప్రైవసీ అనేది మరింత వ్యక్తిగత విషయంగా మారుతుందని వివరించారు.

కాగా, కొన్నిరోజుల కిందట కొత్త ప్రైవసీ పాలసీ తీసుకువచ్చిన వాట్సాప్... ఆ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే సేవలు నిలిచిపోతాయని చెబుతోంది. దాంతో యూజర్లు ప్రత్యామ్నాయ మెసేజింగ్ యాప్ లైన సిగ్నల్, టెలిగ్రామ్ ల వైపు చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

దీనిపై వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాత్ కార్ట్ స్పందిస్తూ, తమ యూజర్లు ఇతర యాప్ లకు తరలిపోతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రైవసీ పరిరక్షణ కోసం పోటీతత్వం ఉండడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. మరోపక్క, వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే.