కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించనున్న ప్రధాని... తొలిరోజు 3 లక్షల మందికి వ్యాక్సిన్

14-01-2021 Thu 16:12
  • జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ
  • దేశవ్యాప్తంగా 3000 కేంద్రాల ఏర్పాటు
  • తొలిరోజున ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్
  • తదుపరి దశలో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంపు
PM Modi will inaugurates corona vaccine program in country

ఎప్పుడెప్పుడా అని యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రస్థాయిలో గురైన భారత్ లో ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా అమలయ్యే కరోనా వ్యాక్సినేషన్ ను ప్రధాని మోదీ షురూ చేస్తారని నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘం సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. తొలిరోజు 3 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు అందిస్తారని వివరించారు.

శనివారం 3000 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించనున్నారు. తొలిరోజున ప్రతి కేంద్రంలో కనీసం 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి దశల్లో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 5 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు వీకే పాల్ తెలిపారు.

తొలిదశలో 30 మిలియన్ల హెల్త్ వర్కర్లకు, ఇతర ముందు వరుస యోధులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తర్వాత దశలో 50 ఏళ్లకు పైబడిన 270 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందిస్తారు. కరోనా బారిన పడేందుకు అత్యధిక అవకాశాలు ఉన్న 300 మిలియన్ల మందికి రాబోయే కొన్నినెలల్లో టీకా వేయనున్నారు. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా డోసులు పెద్ద సంఖ్యలో పంపిణీ కేంద్రాలకు చేరుకున్నాయి.