AP DGP: పోలీసులు కుల‌మ‌తాల ఆధారంగా పనిచేయరు: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

fake news circulating in social media says ap dgp
  • వాస్తవాల‌ను వ‌క్రీక‌రిస్తూ పోస్టులు
  • రాజకీయ కారణాలతో  పోలీసులపై ఆరోపణలు
  • పోలీసుల కులం, మతం అంటూ    ఆరోపణలు
  • దేవాల‌యాల‌కు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్య‌మైన‌వి
ఏపీలో దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నాయంటూ సామాజిక మాధ్య‌మాల్లో అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని, వాస్తవాల‌ను వ‌క్రీక‌రిస్తూ పోస్టులు చేస్తున్నార‌ని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. రాజకీయ కారణాలతో కొంద‌రు పోలీసులపై ఆరోపణలు చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

ఏపీలో దేవాల‌యాల‌కు సంబంధించి మొత్తం 44 కేసులు ముఖ్యమైనవని తెలిపారు. దేవాలయాలపై దాడులు జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొంద‌రు ప్రశ్నిస్తూ,   పోలీసుల కులం, మతం ఫలానా అంటూ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులు కుల‌మ‌తాల ఆధారంగా ప‌నిచేయ‌బోర‌ని స్పష్టం చేశారు.  

దేశ సమగ్రతను కాపాడటంలో పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. అంతర్వేది ఘటన జర‌గ‌డం దురదృష్టకరమ‌ని, అనంత‌రం రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయని అన్నారు. ఇప్ప‌టికే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని ఆయ‌న గుర్తు చేశారు.

ఏపీలోని 58, 871 హిందూ ఆలయాలకు జియో ట్యాగింగ్ చేశామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఏపీలోని 13,000 ఆలయాల్లో ఇప్ప‌టికే 43,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు.  తాము 3 నెలల కిందటే రామతీర్థం ఆలయంలో భద్రతను పెంచామ‌ని, అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామ‌ని చెప్పారు.

అయితే, కొండపైన ఉన్న దేవాలయంలో విద్యుత్ సరఫరా లేకపోవ‌డంతోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. క‌రోనా విజృంభ‌ణ వేళ‌ గ‌త ఏడాది పోలీసుల‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, అయిన‌ప్ప‌టికీ పోలీసులు స‌మ‌స్య‌ల‌ను ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశారని ఆయన చెప్పారు. 
AP DGP
temples
Andhra Pradesh
Police

More Telugu News