COVAXIN: కొవ్యాగ్జిన్​ ధరే చాలా తక్కువ.. మిగతావన్నీ ఎక్కువే!

India looking at 4 more Covid vaccines says Health Secretary Rajesh Bhushan
  • రూ.295కే ఒక్కో డోసు కొవ్యాగ్జిన్
  • కొవిషీల్డ్ ధర రూ.వెయ్యి
  • అత్యధికంగా సినోఫార్మ్ టీకాకు రూ.5,650
  • వివిధ టీకాల ధరలు వెల్లడించిన కేంద్రం
  • మరో నాలుగు టీకాలపైనా ప్రభుత్వం దృష్టి
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చేసింది. అవి వివిధ రాష్ట్రాలకూ చేరుకున్నాయి. అయితే, మరో నాలుగు కరోనా వ్యాక్సిన్లకూ అనుమతినిచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. మిగతా అన్ని వ్యాక్సిన్లతో పోలిస్తే కొవ్యాగ్జినే తక్కువ ధరకు లభించనుంది.

జైడస్ క్యాడిలా జైకోవీ, రష్యా స్పుత్నిక్ వీ, బయాలజికల్ ఈ, జెన్నోవా తయారు చేస్తున్న వ్యాక్సిన్లను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం చెప్పారు. జైడస్ వ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ డిసెంబర్ లో పూర్తయ్యాయని, మూడో దశకు అనుమతులు వచ్చాయని చెప్పారు. స్పుత్నిక్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చేస్తుందని చెప్పారు. బయాలాజికల్ ఈ, జెన్నోవా వ్యాక్సిన్లపై తొలి దశ ట్రయల్స్ జరుగుతున్నాయని, మార్చిలో రెండో దశ ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశముందని చెప్పారు.

ప్రపంచంలోని కొన్ని వ్యాక్సిన్ల ధరలనూ ఆయన వెల్లడించారు. కొవిషీల్డ్ తొలి పది కోట్ల డోసుల వరకు ఒక్కో దానికి రూ.200, ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలకు రూ.వెయ్యిగా నిర్ణయించారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాగ్జిన్ ఒక్కో డోసుకు రూ.295గా ఖరారు చేశారు. ఫైజర్–బయోఎన్ టెక్ తయారు చేసిన బీఎన్టీ162బీ2 (టోజీనమెరాన్) ధర రూ.1,431, మోడర్నా ఎంఆర్ఎన్ఏ1273 ధర రూ.2,348 నుంచి రూ.2,715, చైనా సినోఫార్మ్ బీబీఐబీపీ కొర్వీ ధర రూ.5,650, సినోవాక్ తయారు చేసిన కరోనావ్యాక్ ధర రూ.1,027, అమెరికా కంపెనీ నోవావ్యాక్స్ అభివృద్ధి చేసిన ఎన్వీఎక్స్ కొవ్2373కి రూ.1,114, స్పుత్నిక్ వీకి రూ.734, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ధర రూ.734గా ఉంటుందని చెప్పారు.
COVAXIN
Bharat Biotech
COVID19
SII
Covishield

More Telugu News