అభివృద్ధిని కోరుకోవడమే తప్పయితే నన్ను క్షమించండి: చంద్రబాబు

13-01-2021 Wed 10:01
  • జగన్ నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్టు ఓట్లేశారు
  • జగన్‌ది పైశాచిక ఆనందం
  • మోటార్లకు కాదు మంత్రులకు పెట్టాలి మీటర్లు
  • రేపో మాపో పీల్చే గాలిపైనా పన్ను వేస్తారు
  • రాష్ట్రానికి రెండు కళ్లు అయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారు
Forgive me for want to do development says Chandrababu

ప్రజలంతా అభివృద్ధి చెందాలనే తాను కోరుకున్నానని, తాను చేసిన తప్పు అదే అయితే క్షమించాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పరిటాల వద్ద ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. రాష్ట్రంలో రైతులు ఏమాత్రం సంతోషంగా లేరని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.

జగన్ నాటకాలు నమ్మి ప్రజలంతా పూనకం వచ్చినట్టు ఓట్లు వేశారని, తానేం తప్పు చేశానో అర్థం కావడం లేదని అన్నారు. ఏడు వరుస విపత్తులతో రైతులు అల్లాడిపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండానే చెల్లించానని చెప్పి అడ్డంగా దొరికిన దొంగ జగన్ అని అన్నారు.

ప్రజావేదికను కూల్చిన జగన్ ఆ శిథిలాలను ఇప్పటి వరకు తొలగించకుండా జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా, బూతుల మంత్రులు తనను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి పాలనతో రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని అన్నారు. మీటర్లు వ్యవసాయ మోటార్లకు కాకుండా మంత్రులకు పెట్టాలని అన్నారు. అప్పుడే ఏ మంత్రి ఎంత దోచుకున్నారో తెలుస్తుందన్నారు.

ఈ ప్రభుత్వం చివరికి పెంపుడు జంతువులను కూడా వదలడం లేదని, వాటిపైనా పన్నులు విధిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. రేపో మాపో పీల్చే గాలిపై పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. రాష్ట్రానికి రెండు కళ్లు అయిన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన మోపుతున్న భారాన్ని జీవితాంతం మోయాల్సిన దుస్థితి నెలకొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.