వంట గ్యాస్ బుకింగులోనూ తత్కాల్ సేవలు.. ఇక చిటికెలో డెలివరీ!

13-01-2021 Wed 07:52
  • బుక్ చేసుకున్న 45 నిమిషాల్లోపే డెలివరీ
  • ఫిబ్రవరి 1 నుంచి సేవల ప్రారంభానికి సన్నాహాలు
  • ‘సులభతర జీవనం’ నినాదాన్ని మరింత మెరుగుపరిచే యోచన
Tatkal to be introduced in Gas Booking

గ్యాస్ బుక్ చేసి సిలిండర్ కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు.   వంట గ్యాస్ డెలివరీలోనూ ఇకపై తత్కాల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఇందుకోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రెడీ అవుతోంది. ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారులకు 45 నిమిషాల్లోపే సిలిండర్ డెలివరీ చేస్తారు. ఫిబ్రవరి ఒకటి  నుంచే తత్కాల్ వంటగ్యాస్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు ఐఓసీ అధికారి ఒకరు తెలిపారు.

ఇండేన్ బ్రాండ్ ద్వారా వంటగ్యాస్ సేవలను అందిస్తున్న ఐవోసీకి దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. తత్కాల్ సేవలను ప్రారంభించేందుకు తొలుత ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలోని ఒక నగరం, లేదంటే జిల్లాను ఎంపిక చేసుకోనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘సులభతర జీవనం’లో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంది.