దుబాయ్ లో మహేశ్ బాబు తాజా చిత్రం షూటింగ్?

12-01-2021 Tue 16:19
  • మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
  • బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 25 నుంచి దుబాయ్ లో షూటింగ్  
  • ఇరవై రోజుల పాటు కొనసాగే షెడ్యూలు  
Mahesh Babus new film shoot in Dubai

మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. గతంలో కరోనా.. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడుతూ వచ్చింది. కథ రీత్యా మొదట్లో తొలి షెడ్యూలును అమెరికాలో నిర్వహించాలనుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో వర్క్ పర్మిట్లు రావడంలో ఇబ్బందులు ఎదురవడంతో అమెరికా షెడ్యూలును వాయిదా వేసుకున్నారు.

ఈ క్రమంలో తొలి షెడ్యూలును హైదరాబాదులోనే ప్రారంభిస్తారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజాగా, తొలి షెడ్యూలును దుబాయ్ లో నిర్వహించడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి దుబాయ్ లో షెడ్యూలు జరుగుతుందని అంటున్నారు. సుమారు ఇరవై రోజుల పాటు అక్కడే ఈ షెడ్యూలు కొనసాగుతుంది.  

అనంతరం రెండో షెడ్యూలు షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తారని సమాచారం. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్  ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.