Corona Virus: హైదరాబాద్, విజయవాడలకు చేరుకున్న కరోనా వ్యాక్సిన్.. భారీ భద్రత ఏర్పాటు!

Corona vaccine reaches Telangana and Andhra Pradesh
  • తెలంగాణకు 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్
  • ఏపీకి 4,96,680 డోసులు
  • శీతలీకరణ కేంద్రాల్లో నిల్వ ఉంచిన అధికారులు
మన దేశ చరిత్రలో ఇదొక కీలకమైన రోజు. ఏడాది కాలంగా దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారిని మట్టుబెట్టే క్రమంలో అన్ని రాష్ట్రాలకు ఈరోజు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. ఈ క్రమంలో కాసేపటి క్రితమే ఇరు తెలుగు రాష్ట్రాలకు వ్యాక్సిన్ చేరుకుంది.

తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ ఆరోగ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన శీతలీకరణ కేంద్రానికి వ్యాక్సిన్ చేరుకుంది. పూణే ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక కార్గో విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వ్యాక్సిన్ ను తరలించారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మొత్తం 3.72 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఇక్కడకు చేర్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 40 క్యూబిక్ మీటర్ల వ్యాక్సిన్ కూలర్ లో వాటిని నిల్వ చేశారు.

ఈనెల 16వ తేదీ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ ను తరలిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ ను తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేశారు. తొలుత 2.90 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బంది, పోలీసులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా వేయబోతున్నారు.  

ఏపీ విషయానికి వస్తే... 40 బాక్సుల్లో 4,96,680 వ్యాక్సిన్ డోసులు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. పూణె నుంచి ప్రత్యేక విమానంలో వీటిని తరలించారు. పటిష్ట భద్రత మధ్య వ్యాక్సిన్ ను భద్రపరచనున్నారు. గన్నవరంలోని రాష్ట్ర స్థాయి శీతలీకరణ కేంద్రంలో వ్యాక్సిన్ ను నిల్వ చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రేపు వ్యాక్సిన్ ను తరలిస్తారు. 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభంకానుంది. తొలి దశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
Corona Virus
Vaccine
Telangana
Andhra Pradesh

More Telugu News