Donald Trump: ట్రంప్‌పై అభిశంసన తీర్మానం.. అడ్డుకున్న రిపబ్లికన్లు

  • అవమానకరంగా సాగుతున్న ట్రంప్ చివరి రోజులు
  • అభిశంసన తీర్మానంపై నేటి సాయంత్రం ఓటింగ్
  • రిపబ్లికన్లపై విరుచుకుపడిన స్పీకర్ నాన్సీ పెలోసీ
  • అభిశంసనకు బహిరంగంగా మద్దతు ఇవ్వని బైడెన్
US Democrats move to impeach Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చివరి రోజులు అవమానకరంగా మారాయి. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి తప్పుకోవాల్సిన తరుణంలో అభిశంసన ద్వారా ఆయనను గద్దె దింపేందుకు డెమోక్రాట్లు రెడీ అయ్యారు. కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడడం, వారిని అడ్డుకునే క్రమంలో అదికాస్తా హింసాత్మకంగా మారడం వంటి ఘటనలు ట్రంప్‌కు తలవంపులు తెచ్చి పెట్టాయి. ట్రంప్ వల్ల అమెరికా పరువు మంట కలిసిపోయిందన్న ఆగ్రహంతో ఉన్న డెమోక్రాట్లు.. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు అభిశంసన తీర్మానానికి ముందుకొచ్చారు.

రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ డెమొక్రాట్లు నిన్న ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, రిపబ్లికన్ సభ్యులు దీనిని అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ నాన్సీ పెలోసీ రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. అవాంఛనీయ, అస్థిరమైన, అవాస్తవమైన దేశద్రోహ చర్యలను కొనసాగించేందుకు ట్రంప్ వీలు కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

25వ సవరణను అమలు చేయాలన్న డిమాండ్‌పై నేటి సాయంత్రం సభలో ఓటింగ్ జరగనుంది. దీనిపై స్పందించేందుకు ట్రంప్‌కు పెలోసీ 24 గంటల సమయం ఇవ్వనున్నారు. ఆ తర్వాత డెమోక్రాట్లు అభిశంసన ఓటుతో ముందుకు వెళ్లనున్నారు. కాగా, ట్రంప్‌పై అభిశంసనకు కాబోయే అధ్యక్షుడు బైడెన్ బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. డెలావర్‌లో కరోనా టీకా రెండో డోసు తీసుకున్న అనంతరం బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్ పదవిలో ఉండకూడదని తాను స్పష్టంగా చెప్పానని పేర్కొన్నారు.

More Telugu News