Abhay Singh Chautala: సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే రాజీనామా: స్పీకర్‌కు లేఖ రాసిన హర్యానా ఎమ్మెల్యే

  • 26లోగా చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • సాగు చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించిన ఎమ్మెల్యే
  • తాను కూడా బయటకు వెళ్తానన్న జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా
Abhay Singh Chautala threatens to resign from Haryana Assembly

నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హర్యానాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) ఎమ్మెల్యే అభయ్ ‌సింగ్ చౌతాలా హెచ్చరించారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ జ్ఞాన్ చంద్‌గుప్తాకు నిన్న లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నల్లచట్టాలుగా ఆ లేఖలో అభివర్ణించిన అభయ్‌సింగ్ ఈ నెల 26లోగా వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆ లేఖనే తన రాజీనామాగా పరిగణించాలని కోరారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల్లో ఇప్పటి వరకు దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారని, అయినప్పటికీ కేంద్రం స్పందించడం లేదని అభయ్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా రైతు నిరసనల్లో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, హర్యానాలో బీజేపీకి మద్దతు ఇస్తున్న జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా కూడా ఇలాంటి డిమాండే చేశారు. మద్దతు ధరపై హామీ ఇవ్వకుంటే మద్దతుపై పునరాలోచిస్తానని హెచ్చరించారు.

More Telugu News