ఆర్టిస్టులకు కోటి రూపాయలు ఎగ్గొట్టిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ: ఎఫ్‌డబ్ల్యూఐసీఈ

12-01-2021 Tue 06:55
  • పనిచేయించుకుని డబ్బులు చెల్లించని వర్మ
  • వెంటనే డబ్బులు ఇవ్వాలంటూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నోటీసులు
  • అప్పటి వరకు ఆయన సినిమాలకు ఎవరూ పనిచేయరని హెచ్చరిక
Director Ram Gopal Verma who evaded crores of rupees for artists

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో నిలిచే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు సంబంధించి ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తన సినిమాలకు పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వర్కర్లకు దాదాపు కోటి రూపాయల వరకు ఎగ్గొట్టాడన్నదే ఆ విషయం. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు ఆ సంఘం అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. ఎగ్గొట్టిన డబ్బులను వెంటనే చెల్లించాలంటూ ఆ నోటీసులలో పేర్కొన్నారు. డబ్బులు చెల్లించనంత వరకు వర్మ సినిమాలకు ఇకపై తమ 32 యూనియన్లలో ఒక్కరు కూడా పనిచేయరని ఆయన హెచ్చరించారు. కాగా, ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నోటీసులను వర్మ చాలా తేలిగ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది.