బీజేపీ శ్రేణులను ట్రంప్ అనుచరులతో పోల్చిన మమతా బెనర్జీ

11-01-2021 Mon 21:57
  • బీజేపీ, టీఎంసీ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
  • నాదియా సభలో మమతా విమర్శలు
  • ఓడిపోయినా తామే గెలిచామంటారని బీజేపీపై వ్యాఖ్యలు
  • ట్రంప్ అనుచరుల్లాగే ప్రవర్తిస్తారని ఎద్దేవా 
Mamata Banarjee compared BJP cadre with Trump followers

పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య విమర్శల దాడుల్లో పదును పెరిగింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీ నాయకులకు గట్టిగా బదులిస్తున్నారు. తాజాగా నాదియా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె కాషాయదళంపై విమర్శలు చేశారు. బీజేపీ శ్రేణులను ట్రంప్ అనుచరగణంతో పోల్చారు. ఇటీవల కాపిటల్ బిల్డింగ్ వద్ద వేలమంది ట్రంప్ అనుచరులు రభస సృష్టించడాన్ని మమతా బెనర్జీ ప్రస్తావించారు.

ట్రంప్ అనుచరులకు, బీజేపీ శ్రేణులకు పెద్దగా తేడా లేదని అన్నారు. అక్కడ ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ వర్గీయులు ఎలా ప్రవర్తించారో, ఇక్కడ బీజేపీ నేతలు, కార్యకర్తలు అలాగే ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. " అమెరికాలో ఏంజరుగుతోందో మీరు చూడడం లేదా? ఓటమిపాలైనా గానీ ట్రంప్ తానే గెలిచానంటున్నాడు. బీజేపీ కూడా అలాగే చెబుతుంది... మేమే గెలిచాం, మేమే గెలిచాం అని చెప్పుకుంటుంది. బీజేపీకి ఎప్పుడైతో ఓటమి ఎదురవుతుందో వారి పరిస్థితి కూడా ట్రంప్ అనుచరుల్లాగే ఉంటుంది" అని స్పష్టం చేశారు.

అంతేకాదు, బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, భారతీయ జంక్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తనను డబ్బుతో కొనలేమని తెలుసు కాబట్టే బీజేపీకి తానంటే భయం అని మమతా వ్యాఖ్యానించారు. తుపాకీ గొట్టం ఎదుట అయినా నిల్చుంటాను కానీ, బెంగాల్ ను వాళ్లు అమ్ముతుంటే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు.